పెద్దిభొట్ల సుబ్బరామయ్య

”గురజాడ, శ్రీ పాద, కొ.కు., గోపీచంద్‌, చాసో వంటి కథకుల కోవకు చెందిన పెద్దిభొట్ల జీవిత వాస్తవికతను-వాస్తవిక, అభ్యుదయ దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి శిల్పాత్మకంగా రూపు కట్టించే సంప్రదాయానికి వారసుడు”

peddibhotla

మానవ జీవితంలోని విషాద దృశ్యాలను నాలుగున్నర దశాబ్దాలుగా కథలుగా, నవలలుగా చిత్రీకరిస్తున్న పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1938 డిసెంబర్‌ 15వ తేదీన గుంటూరులో జన్మించారు. ఎం.ఏ వరకు చదివిన వీరు విజయవాడ ఆంధ్ర లయోల కళాశాల ఆంధ్రశాఖలో 1957 నుంచి నలభై ఏళ్ళపాటు అధ్యాపకునిగా పనిచేస్తూ ఆ శాఖ అధ్యక్షునిగా 1996 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు.

వీరు నయనతార, నీళ్ళు, ముసురు, పొగమంచు, కళ్ళజోడు, చిలకహంస, గాంధీని చూసినవాడు ఇవిగాక పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల సంపుటాలను వెలువరించారు. వీరి కథలనేకం వివిధ సంకలనాలలో చోటు చేసుకున్నాయి. అంతేగాక రష్యన్‌, ఆంగ్లం, వివిధ భారతీయ భాషలలోకి అనువాదమైనాయి.

“A Rainy Day and Other Stories” ఒక కథా సంపుటి ఆంగ్లంలో కూడా వెలువడింది. అభ్యుదయ రచయితల సంఘం, కృష్ణాజిల్లా శాఖ అధ్యక్షులుగా 1973లో సుడి కథా సంకలనానికి సంపాదకునిగా వ్యవహరించారు. వీరి పలు కథలు ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారమైనాయి. ధృవతార, చేదుమాత్ర, అంగారతల్పం, ముక్తి, పంజరం, కాలుతున్న పూలతోట, సూర్యోదయం, త్రిశంకు స్వర్గం, వర్ణమాల, అర్జునుడు వీరి అచ్చయిన నవలలు.

పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కథా రచయిత పురస్కారం, 1995లో ప్రతిష్టాత్మక రావిశాస్త్రి సాహిత్య పురస్కారం, 1998లో గోపీచంద్‌ స్మారక సాహిత్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు.

అరసంతో తొలినుంచీ పెద్దిభొట్లకు అనుబంధం ఉంది. అరసం-గుంటూరు జిల్లా శాఖ నిర్వహించిన అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారాన్ని 2003లో స్వీకరించారు.

సుబ్బరామయ్య గారి కథలలో విలువైన “పేరయ్య బావి” కథ మీ కోసం.

*****

పేరయ్య బావి

Perayya baavi

దిగంతాల నుండి విపరీతమైన వేగంతో సుళ్ళు తిరుగుతూ సమస్త జీవరాసులలోని తేమనూ, చైతన్యాన్నీ హరించివేస్తూ వీస్తున్న వెచ్చని గాలి ఆ పరిసరాలలోకి వచ్చినంతనే చల్లబడుతున్నట్లుగా ఉంది. ఆకాశాన ఒక్క మేఘశకలమైనా లేదు. ఎండ వేడిమికి భయపడి కీటకాది క్షుద్ర జీవులు కూడా తమతమ నెలవులు విడిచి చరించడంలేదు. ఇంతసేపటికొక కాకి గూటిని వదలి ఆహారంకోసం బయటకు వచ్చిందో ఏమో, నీరసంగా ఎగురుతూ పోతున్నది.

ఆ యువకుడు సేదదీరి వేపచెట్టు బోదెకానుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అతనికి అంతా కలవలె తోచింది. అతడు ఉదయం అనగా బయలుదేరి సూర్యుడు నడినెత్తిమీదికి వచ్చేదాకా చేతిలో సంచితో నడుస్తూనే ఉన్నాడు. అవన్నీ మరుభూములు. అక్కడక్కడ చెరువుల మీద ఆధారపడి వుండే మాగాణి భూములు ఉన్నాయి. భూమి అంతా బీటలు వారి నీటికి మొహంవాచి ఉన్నది. ఆ యువకుడు మరి నాలుగుమైళ్ళు నడిస్తే స్వగ్రామం చేరుకోగలడనగా అతనికి విపరీతమైన దాహం ప్రారంభమైంది. వెచ్చనిగాలి బాణ వేగంతో వీస్తూ వుండడం వల్ల అతని సర్వనాడులూ క్రుంగిపోయాయి. అడుగుతీసి అడుగు వెయ్యటమే కష్టమైపోయింది. ఎక్కడా కనుచూపు మేరలో ఏవూరూ కనిపించటం లేదు. తూర్పుదిశగా ఒక వందగజాల దూరంలో ఒక వేపచెట్టు మాత్రం ఒంటరిగా వుంది. అతడు ఆ చెట్టుదరికి చేరుకున్నాడు. అతని కల వేయి రెట్లుగా ఫలించినట్టయింది. ఆ చెట్టుకు పదిగజాల దూరంలోనే ఒక బావీ, ఇనుప గొలుసుతో వున్న ఒక బొక్కెనా అతనికి కనిపించాయి. అతడు సంచి అక్కడ పడేసి త్వరత్వరగా ఆ నీళ్ళుతోడుకొని, కాళ్ళూ చేతులూ మొహమూ కడుక్కుని తర్వాత కడుపునిండా త్రాగాడు. ఆ నీళ్ళు కొబ్బరిపాలవలె ఉన్నాయి. అతడు నెమ్మదిగా వేపచెట్టు బోదెకానుకుని కూర్చున్నాడు.

నిజానికి ఇంతకుపూర్వం వలె సూర్యబింబం నిప్పులను కురిపిస్తూనే ఉంది. వేడిగాలి ‘రివ్వున’ వీస్తూనే ఉన్నది. అయినా అతని కళ్ళకు సమస్త ప్రపంచమూ, చల్లగా హాయిగా కనిపిస్తున్నది.

ఈ మరుభూమిలో, ఈ కాలిబాటల ప్రక్కగా ఒంటరిగా ఈ బావి ఎందుకు వుంది? అక్కడికి చుట్టూ ఏడెనిమిది మైళ్ళ పరిధిలో ఏ వూరూ ఉన్నట్టు లేదు. ఈ ప్రాంతంలో బావిని ఎవరు త్రవ్వించారు? ఏ ప్రయోజనం ఉద్దేశించి త్రవ్వించారు?

ఆ యువకుడికి కొద్ది క్షణాల్లోనే మగతగా నిద్ర పట్టింది.

*****

ఏపుగా పెరిగిన వెదురుచెట్ల మధ్య భుజం మీద మంచినీళ్ళ కావడితో వడివడిగా నడుస్తున్నాడు పేరయ్య. ప్రక్కనే ఏ చెట్టు కొమ్మలలోనో దాక్కుని ఉండి కోయిల కూస్తున్నది. వేగంగా వీచే గాలిని తమలో పూరించుకొని వెదురు పొదలు ‘జుమ్మ’ని శబ్దం చేస్తున్నాయి. పేరయ్య త్వరత్వరగా నడిచి వూరి చివరగా ఉన్న ఒక ఇంట్లో ప్రవేశించి నీళ్ళుకావడి దింపాడు.

ఆ వూరిలో ఉన్న బావులన్నిటిలోనూ నీళ్ళు సముద్రపు నీటివలె ఉప్పగా ఉంటాయి. ఊరికి అరమైలు దూరంలో ఉన్నదొక పెద్ద మంచి నీళ్ళబావి. ఆ బావినీరే ఊళ్ళోవారికి శరణ్యం. ఉప్పునీరు స్నానాలకూ, పైవాడకానికీ తప్ప మరెందుకూ పనికిరాదు. పేరయ్య రోజూ చీకటి ఉండగానే లేచి స్నానం చేసి, తడిగుడ్డతోనే భుజంమీద కావడి వేసుకొని బయలుదేరి, బాగా పొద్దెక్కేదాకా బావి నుంచి వూరికీ, వూరినుంచి బావికీ తిరిగి అందరి ఇళ్ళకూ నీరు చేరవేస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి నాలుగు గింజలు ఉడకేసుకుని తిని కాస్సేపు నడుం వాల్చి లేస్తాడు. మూడు గంటలు కాగానే భుజంమీద కావడితో బయలుదేరుతాడు.

అతని తండ్రి కూడా సరిగ్గా అలాగే చేసేవాడు. పేరయ్య పదహారేళ్ళవాడై వుండగా అతని తండ్రికి పక్షవాతం వచ్చి కాలూ చెయ్యీ పడిపోయి మంచంలోనుంచి లేవలేకపోయాడు. తర్వాత కొద్ది రోజులలోనే, పసివాడైన పేరయ్య భుజం మీద కావడి, కుటుంబ భారమూ పడ్డాయి. కుటుంబమంటే మందీ మార్భలమూ ఏమీలేదు. అతనికి అప్పటికి ఉన్నదల్లా తల్లి ఒక్కతే. ఆమె అసలే బలహీనురాలు. పైగా భర్త మరణం ఆమెను మరింత క్రుంగదీసింది. ఆమెలో జవసత్త్వాలు సన్నగిల్లిపోయాయి. ఆమె కళ్ళు గాజుబిళ్ళలవలె ఉండేవి. పగలే చూపు సరిగా ఉండేది కాదు. అయినా తప్పనిసరి కాబట్టి నెమ్మదిగా తడువుకుంటూ ఇంటి పనులు చేసుకునేది. రోజూ పేరయ్య అన్ని ఇళ్ళకూ నీళ్ళుమోసి అలసిపోయి ఇంటికి వచ్చి భోజనం ముందు కూర్చునేసరికి ఆమె ప్రారంభించేది ”ఏమిరా, నాయనా! చూస్తున్నావుగా నా అవస్థ! పెద్ద ముండనైనాను బ్రతికినన్నాళ్ళు బ్రతకబోను. మొన్న ఆ పుండరీకాక్షయ్య ఎక్కడో ఏదో మనువు ఉన్నదని చెప్పాడు. నువ్వు ఒక ఇంటివాడివైతే చూసి కళ్ళు మూస్తాను… ఏమీ సమాధానం చెప్పకుండా అలా నల్లరాయిలా కూర్చుంటావు, ఎలారా నీతో వేగటం?” అంటూ వుండేది. పేరయ్య స్వతహాగా మితభాషి. తల్లి కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం చూసి అప్పుడప్పుడు ”ఇప్పుడేం తొందరొచ్చిపడిందే? నీకు మరీ చాదస్తం…” అనేవాడు.

అంతగా పోరు పెట్టినప్పటికీ ఆ ముసలిదాని కోరిక తీరనేలేదు. ఒకనాడు మేఘాలు ముసురుకొని పగలే చీకటి కమ్మినట్టయి, మరి కాస్సేపట్లో వర్షం ప్రపంచాన్ని ముంచెత్తుతుందనగా ఆమె వంట పూర్తిచేసి పంచలోకి వచ్చి కొంగు పరచుకుని పడుకుని సునాయాసంగా ఎవరినీ బాధ పెట్టకుండా ఒంటరిగా ప్రాణాలు వదిలింది.

పేరయ్య వచ్చి కావడి దింపి నిద్రిస్తున్న తల్లిని ‘లేపి ఇబ్బంది పెట్టటం ఎందుకులెమ్మ’ని అనుకుని లోపలికి వెళ్ళి సిద్ధంగా వున్న అన్నం వడ్డించుకుని సుష్టుగా భోజనం చేశాడు. తర్వాత చెయ్యి తుడుచుకుంటూ పంచలోకి వచ్చి ఇంకా అలాగే పడుకుని వున్న తల్లిని చూసి నవ్వుకుని ‘అమ్మా’ అని పిలిచాడు. ఆమె లేచి ”ఎప్పుడు వచ్చావురా నాయనా” అని అడిగితే ”నేను రావటమూ అయింది, నా భోజనమూ అయింది. నువ్వు లేచి కాస్త ఎంగిలిపడు. అసలే పొద్దెక్కింది” అందామనుకున్నాడు. కాని అతడు రెండుసార్లు పిలిచినా, ఆమె కదలనైనాలేదు. అతనికి అనుమానం వేసి దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసి ఒక్కసారిగా బావురుమన్నాడు. అతని ఏడుపు విని నలుగురూ చేరారు. తర్వాత వారు తలా ఒక చెయ్యీ వేసి అన్ని పనులూ పూర్తిచేశారు. పేరయ్య మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక ప్రక్కగా కూర్చుని ఒంటరిగా దుఃఖించాడు.

అప్పటికి అతనికి ఇరవై యేళ్ళు. రోజూ తెలతెలవారుతుండగా లేచి స్నానంచేసి కావడి భుజంమీద వేసుకుని బావికి బయలుదేరేవాడు. అపరాహ్ణందాకా అదే పని. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరి పొద్దుగూకిన తర్వాత ఇంటికి చేరుకునేవాడు.

ఆ వూరి కరణం ఒకనాడు పేరయ్యను పిలిచి ”ఏమిరా! ఇలా ఎన్నాళ్ళని చెయ్యి కాల్చుకుంటావు? రేపు నేను పాలెం పోతున్నాను. నా వెంబటరా, నా ఎరికలో ఒక సంబంధం వుంది. పిల్లను చూసి రావచ్చు” అన్నాడు. ఆయన ఎదుట మాట్లాడలేక పేరయ్య వినయంగా తలవూపి వచ్చేశాడేగాని తర్వాత ఆలోచిస్తే ఒక ముఖ్యవిషయం జ్ఞప్తికి వచ్చింది. పెళ్ళి అనగానే ఎంత లేదన్నా ఏమీ నగలూ నాణ్యాలూ పెట్టకపోయినా కొన్నివందల రూపాయలు ఖర్చు, తన దగ్గర చిల్లి గవ్వకూడా లేదు. ఉన్న కొద్ది సొమ్ము తల్లి అంత్యక్రియలకూ, సంతర్పణకూ ఖర్చు అయింది. అతడు మర్నాడు కరణంగారి ఇంటికివెళ్ళి ఈ విషయం ప్రస్తావించాడు. డబ్బు విషయం ఎత్తగానే ఆయన నవ్వి ”పిచ్చివాడా అదా నీ సందేహం? మేమంతా ఏమైపోయామనుకున్నావు? అలాంటి పిచ్చి సందేహాలు పెట్టుకోకు. ఇంటికి వెళ్ళి తెల్లని చొక్కావుంటే తొడుక్కునిరా” అన్నాడు.

పేరయ్య ఇంటికివెళ్ళి తన తండ్రి తాలూకు చొక్కా ఒకటి ఏరి తొడుక్కున్నాడు. అది తెల్లగానే వుంది. భుజంమీద కొద్దిగా చిరిగినంత మాత్రంలో ఏమీ లోపం రాదు. పైన ఉత్తరీయం ఉండనే ఉంది.

అతడు కరణంగారి వెంట పాలెం వెళ్ళి పిల్లను చూశాడు. పిల్ల తండ్రి బీదవాడు. ఆయనకు నలుగురు ఆడపిల్లలు. పెద్ద పిల్లలు ముగ్గురికి ఉన్నంతలో మంచి సంబంధాలు కుదిర్చి పెళ్ళిళ్ళు చేశాడాయన. చివరి పిల్ల పేరు వర్ధని. ఆ పిల్లవంతు వచ్చేసరికి ఆస్తి ఏమీ మిగలలేదు. పైగా పిల్ల పెళ్ళికెదిగి కూర్చున్నది. ఈ భారం ఎలా వదుల్చుకోవటమా అని ఎదురుచూస్తున్న ఆయనకు పేరయ్య అన్నివిధాలా తగినవాడుగా కనిపించాడు. కుర్రవాడు కష్టపడి జీవించే తరహా వ్యక్తి కాబట్టి తిండికీ బట్టకూ లోపం జరగదు.

పేరయ్య తనముందు చాపమీద తలవంచుకుని కూర్చుని ఉన్న పిల్లను చూశాడు. ఆ కొద్దిసేపూ వినియోగించుకునేందుకు ప్రక్క ఇంటి వారినడిగి ఏవేవో నగలు తెచ్చి ఆ పిల్లను అలంకరించారు. నిజానికి ఆ పిల్లకు ఆ అలంకరణలేవీ అవసరం లేదు. మంచులో తడిసిన మందార పువ్వువంటి ముగ్ధ సౌందర్యం ఆమెది. ఆ కన్నులు విశాలములై ఆ శరీరచ్ఛాయ పదారువన్నె పసిడిఛాయతో పోటీ పడుతున్నది. ఆ తతంగం ముగియగానే పేరయ్య పెదవి కదపకుండా లేచి కరణంగారి వెంట బయటికి వచ్చాడు.

ఆయన ”ఏమిరా! పేరయ్యా! పిల్ల ఎలా వుంది? నచ్చిందా?” అని అడిగితే తలవూపి వూరుకున్నాడు. తర్వాత కొద్దిరోజులు వ్యవధిలోనే ఒక ముహూర్తం నిర్ణయించి నలుగురు పెద్దలూ చేరి శుభకార్యం అయిందనిపించారు. పేరయ్య తన ఒంటరితనం పోయినట్టూ, తనకీ ప్రపంచంలో అతిదగ్గర బంధువులెంతోమంది ఉన్నట్టూ అనుభూతి పొందాడు. అతనికాశ్చర్యం వేసింది.

ఇన్నాళ్ళుగా ఈ విశాల విశ్వంలో ‘నా’ అనుకోదగిన వారెవరూ లేని తనకు ఈనాడు చిత్రంగా తననే సర్వస్వం అనుకునే ప్రాణి లభించింది. అతడు ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిపోయినాడు.

తర్వాత కొన్ని నెలలకు ఆ పిల్ల చీర సారెతో కాపురానికి వచ్చింది. వస్తూ ఆ ఇంటికి వెలుగును తీసుకువచ్చింది. పేరయ్య జీవితాన్ని వెలిగించే జ్యోతిగా ఆమె ఆ ఇంట్లో అడుగు పెట్టింది. కొద్ది సాహచర్యంతో మామిడిచెట్టును అల్లుకున్న మాధవీ లత వలె ఆమె అతనికి తన్ను తాను అంకితం చేసుకున్నది. రోజంతా కష్టపడి యింటికి వచ్చిన పేరయ్య భార్య పరిచర్యలో స్వర్గసౌఖ్యం అనుభవించేవాడు. ఆమె, ప్రణయజలధిలో మునకలు వేసి అలసి సొలసి, కాయలు గాచిన అతని భుజాలమీద తలవాల్చి నిద్రించేది.

తర్వాత సంవత్సరానికి ఆ పిల్ల గర్భవతి అయింది. తల్లిదండ్రులు వచ్చి కాన్పుకు ఆ పిల్లను తమవెంట తీసుకుపోయారు. ఆమె వెడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పేరయ్య కూడా చలించిపోయాడు. అయినా ఆమెను సముదాయించి ”పిచ్చిదానా! ఇక్కడికి పదిమైళ్ళే కదూ! ఏమన్నా దూరమా భారమా? రెండు రోజులకొకసారి వచ్చి నిన్ను చూడకపోతే నేను మాత్రం బ్రతకగలనా?” అన్నాడు.

అలాగే మాట తప్పకుండా అతడు రెండు మూడు రోజులకొకసారి వెళ్ళి చూసి వస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లోనే ఆమెకేదైనా ఒక బంగారునగ చేయించాలనే కోరికతో అతడు డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు.

ఆమెకు తొమ్మిది నెలలూ నిండిన తర్వాత అతడొకనాడు వెళ్ళేసరికి ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుని కూర్చుని వుంది. పేరయ్య ఆమె దగ్గరకు వెళ్ళి ”ఏమిటే వర్థనీ! ఎందుకేడుస్తున్నావు?” అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత పేరయ్య బావమరది నోట అసలు విషయం విన్నాడు. పండుగకు ఆమె అక్కలిద్దరూ పుట్టింటికి వచ్చారు. వారిలో ఒకామెకూ వర్థనికీ చిన్నప్పటినుంచీ పడదు. ఆమె ‘నీ మొగుడు నీళ్ళు మోసుకుని బతుకుతాడ’ని వర్థనిని ఎగతాళి చేసింది. ఆ పూట వర్థని అన్నం తినలేదు. అక్కవచ్చి ‘పొరపాటున అన్నాను. బుద్ధి తక్కువదాన్ని, లేచి అన్నం తినవే’ అని బతిమలాడినా ఆమె కదలలేదు.

పేరయ్యకు నవ్వు వచ్చింది. వర్థని దగ్గరగా వెళ్ళి ”ఆ మాత్రం దానికే అంత కోపం చేసుకోవాలా? తప్పుకదూ! తమాషాకు ఏదో అన్నదే అనుకో, ఇంత రాద్ధాంతం చెయ్యవచ్చునా? లే. త్వరగా అన్నం తిను…” అన్నాడు. ఆమె లేచి కళ్ళు తుడుచుకుని వంట ఇంట్లోకి వెళ్ళింది.

తర్వాత కొద్దిరోజులలోనే పేరయ్యకు పిడుగువంటి వార్త వచ్చింది. ఒకరోజున తెల్లవారుజామునే స్నానం చేసి బావికి బయలుదేరుతూ ఉండగా ఒక మనిషి వచ్చాడు. ఆ రాత్రి అతని భార్యకు నొప్పులు వచ్చాయనీ, కాన్పు కష్టమయిందనీ, పిల్ల పుట్టి పోయిందనీ, తల్లి కూడా బ్రతికేదాకా నమ్మకం లేదనీ కబురు తెచ్చాడా వ్యక్తి. పేరయ్య కాళ్ళ క్రింద భూమి కరిగిపోతున్నట్లనిపించింది. త్వరత్వరగా పంచె కట్టుకుని పైన ఉత్తరీయంతో ఆ మనిషి వెంట నడిచాడు. అంత దూరమూ తన పెన్నిధిని తనకు దూరం చెయ్యవద్దని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే నడిచాడు. కాని విధి ప్రతికూలంగా వ్యవహరించింది. అతనికి చూపులైనా అందలేదు.

పేరయ్యకు లోకమంతా చీకటి అనిపించింది. అతని సుఖం చట్టుబండలైపోయింది. దొరికినట్లే దొరికి అంతలోనే చేయి జారిపోయిందొక అమృత కలశం. అతడు ఎంతోసేపు శిలా విగ్రహం వలె చేష్టలుడిగి కూర్చుండిపోయాడు.

పేరయ్య మళ్ళీ తన పని ప్రారంభించాడు. జీవితం మళ్ళీ గాడిలో పడింది. ఒంటరిగా నిర్లిప్తంగా రోజు గడపటం ప్రారంభించాడు. అతని మనసులో దిగులు లేదు. బాధలేదు. యంత్రం వలె తయారైనాడు.

అప్పుడప్పుడూ వారు వీరు ‘మళ్ళీ పెళ్ళి చేసుకో పేరయ్యా!’ అనేవారు. అతడు వారి మాటలు విని నవ్వి ఊరుకునేవాడు. తర్వాత ఏళ్ళు గడిచేకొద్దీ అతనిలో మార్పు వచ్చింది. అకాల వార్థక్యం అతని సర్వాంగాలనూ ఆక్రమించింది. మొహం ముడతలు పడి జుట్టు తెల్లబడింది. శరీరంలో జవమూ, సత్త్వమూ ఉడిగిపోయి ఉత్సాహం తగ్గింది. అతడు తన పని తప్ప మరే విషయాన్నీ పట్టించుకునేవాడు కాదు.

ఒకనాడు కరణం అతన్ని పిలిచి ‘పేరయ్యా! మా అమ్మాయికి ఏటి అవతల భోగాపురంలో సంబంధం కుదిరింది. నువ్వు వెళ్ళి లగ్న పత్రిక ఇచ్చిరావాలి’ అన్నాడు. పేరయ్య తలవూపి, అప్పటికి అన్ని ఇళ్ళలోనూ నీళ్ళు చేరవెయ్యటం పూర్తి అయినందువల్ల, ఇంటికి వెళ్ళి త్వరత్వరగా నాలుగు గింజలు ఉడకేసుకుని తిని చొక్కా తొడుక్కుని సిద్ధమై వచ్చాడు. కరణం అతని చేతికి పసుపు పూసిన లగ్నపత్రిక ఇచ్చాడు. పేరయ్య ఉత్సాహంతో నడవటం ప్రారంభించాడు.

నడివేసవి, వేడిగాలి విసురుగా వీస్తున్నది. ఆ గాలికి సర్వావయవాలూ చచ్చుబడిపోతున్నాయి. పేరయ్య కాలిబాట వెంట ఏడుమైళ్ళు నడిచిపోయి భోగాపురం చేరుకొని అక్కడ ఇల్లు వాకబు చేసి కనుక్కుని లగ్నపత్రిక ఇచ్చి మళ్ళీ వెంటనే బయలుదేరాడు. ”ఈ ఎండలో ఎలా పోగలవు? కాస్త నడుం వాల్చి పోరాదూ?” అని ఆ ఇంటి యజమాని చెప్పినా వినక ”కాదండి బాబుగారూ! అక్కడ నీళ్ళ ఇబ్బంది ఉన్న సంగతి మీకు తెలుసుగా! కాస్త పొద్దువాటారేసరికి నేను కావడి భుజాన వేసుకోవాలి. లేకపోతే అందరూ ఇబ్బంది పడతారు” అని సమాధానం చెప్పి తాంబూలంలో వచ్చిన రెండు రూపాయలూ రొండిన దోపుకొని తిరుగుముఖం పట్టాడు.

ఎండ వేడిమి ఏమాత్రమూ తగ్గలేదు. భానుబింబం నిప్పులు చెరుగుతున్నది. వేడిగాలి యథాప్రకారం బాణ వేగంతో వీస్తూనే ఉన్నది. పేరయ్య కాళ్ళకు చెప్పులైనా లేవు. ఆ ఏటి ఇసుకలో నడిచి అవతలి ఒడ్డు చేరుకునేసరికి అతనికి ఆయాసం వచ్చింది. కాళ్లు బొబ్బలెక్కినయ్‌. విపరీతమైన దాహంతో నాలుక పిడచగట్టుకపోతున్నది. ఉత్తరీయం కళ్ళకు ఒత్తుకుంటూ అతడు ఒక్క క్షణం వెనక్కి తిరిగి నుంచున్నాడు. విపరీతమైన వేగంతో సుడిగాలి రేగి అతన్ని ఎర్రని దుమ్ములో ముంచివేసింది. అతని శరీరం తూలిపోయింది.

కొద్దిగజాల దూరంలో అతని కళ్ళకొక విశేషం కనిపించింది. అతడు తనలో ”ఛ… ఇది నా భ్రమ అయి ఉంటుంది. ఈ మరుభూమిలో… ఇంత ఎండలో… అబ్బే” అనుకుంటూ తూలుతూ ఆవైపు నడిచాడు.

ఎనభై ఏళ్ళ ముదుసలి ఒకామె నాలుగైదు తాటాకులతో ఒక చిన్న పందిరి వేసుకుని కాలిబాట పక్కగా కూర్చుని వుంది. ఆమె ముందు రెండు కుండల నిండుగా చల్లని నీళ్ళు ఉన్నాయి. ఆమె, తూలుతూ వచ్చిన పేరయ్యకు ఒక చెంబునిండా నీళ్ళు అందించి, ”బాగా ఎండ దెబ్బతిన్నావు… ముందు మొహం కడుక్కో నాయనా… ఒక్కక్షణం ఆగి నీళ్ళు తాగవచ్చులే… ఇప్పుడే తాగితే వడ తగులుతుంది” అన్నది.

పేరయ్య కాళ్ళూ, చేతులూ, మొహమూ కడుక్కున్నాడు. ఆ నీళ్ళ స్పర్శకే అతనిలో జీవం మోసులెత్తింది. ఖాళీ చెంబు ఆమె కందించి ఒక్క క్షణం కూర్చున్నాడు. తర్వాత ఆమె త్రాగేందుకు నీళ్ళు అందించింది. కడుపు నిండుగా ఆ చల్లని నీళ్ళు తాగి ఒక మూలగా ఆ నీడలో ముడుచుకుని పడుకున్నాడు పేరయ్య. అతనికి నిద్ర ముంచుకు వచ్చింది.

అతనికి మెలకువ వచ్చేసరికి ఎండవేడిమి కొద్దిగా తగ్గింది. గాలిలో వెచ్చదనం కూడా తగ్గిపోయింది. అతడు లేచి ఆ అవ్వవంక ఒక్కసారి చూశాడు. ఆమె బోసినోటితో మెరుపు మెరిసినట్టు నవ్వింది. పేరయ్య ”వస్తానమ్మా” అంటూ నడవటం ప్రారంభించాడు.

అతడు కరణంగారి ఇంటికి వెళ్ళి కబురు చెప్పి తన ఇంటికి వచ్చాడు. చొక్కా విప్పి వంకెకు తగిలించి సందుగు పెట్టెలోనుంచి ఒక చిన్న రేకుపెట్టె బయటికి తీశాడు. అందులో ఎన్నో ఏళ్ళ క్రిందట తన భార్యకు ఏదైనా నగ చేయిద్దామని అతడు కూడబెట్టిన ధనం వుంది. ఆ మొత్తం మొదట వంద రూపాయలే. ఆ తర్వాత అడపాదడపా లభించిన డబ్బు కూడా అందులోనే వేశాడు. కూర్చుని అంతా లెక్కపెడితే రెండువందల పదిహేను రూపాయలున్నాయి. ఇప్పుడు లగ్నపత్రిక మూలంగా దొరికిన రెండు రూపాయలు కూడా అందులో వేశాడు.

తర్వాత కొన్ని రోజులపాటు అతడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తాను ఆనాడు ఎండలో పడిన అవస్థ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేవాడు. ఆ ముదుసలి తన పాలిట దేవతవలె ఆనాడు అక్కడ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే తానప్పటికప్పుడే ప్రాణాలు వదిలి వుండేవాడు. రైలు స్టేషను నుంచి ఏ వూరికి రావాలన్నా ఆ కాలిదోవలే గతి. ఒకవూరినుంచి మరొక వూరికి పోవాలన్నా ఆ మరుభూములలో కాలిబాటలే శరణ్యం.

కరణంగారి ఇంట్లో పెళ్ళి అయిపోయింది. పేరయ్యకు విపరీతమైన తాకిడి తగిలింది. అతడు కావడి క్రిందికి దింపేందుకు కూడా వీలు చిక్కలేదు. ఆ హడావుడి తగ్గిన తర్వాత కరణంగారు పేరయ్యకు ఇరవై రూపాయలూ, ఒక ధోవతుల చాపూ తాంబూలంలో పెట్టి ఇచ్చాడు.

పేరయ్య ఒకనాడు నడిచివస్తూ ఆగిపోయాడు. ఇంతకుపూర్వం కాలిబాట పక్కన అవ్వ కూర్చుని వున్నచోట పదేళ్ళ పిల్లవాడు కూర్చుని వున్నాడు. ‘ఇక్కడ అవ్వ ఏదీ?’ అని పేరయ్య అడిగిన మీదట ఆ పిల్లవాడు కళ్ళనీళ్ళు పెట్టుకొని ”మా నాయనమ్మ… చచ్చిపోయింది” అన్నాడు.

పేరయ్య కొద్ది క్షణాలపాటు చేష్టలుడిగి నిలుచుండిపోయాడు. తర్వాత నెమ్మదిగా నడిచి తన ఊరికి వచ్చాడు.

అతడు రెండు రోజులుపాటు ఏమాలోచించాడో తెలియదు. మూడోనాడు ప్రొద్దున్నే నలుగురు పనివాళ్ళని పిలిచి వారితో మంతనాలు ప్రారంభించాడు. వాళ్ళలో ఒకడు ”నీకు పిచ్చిగాని పట్టిందా బాపనయ్యా! అక్కడ బావి తవ్వటం ఎందుకు? తవ్వినా నీళ్ళు పడవు కదా! అంతా గొడ్డునేల” అన్నాడు. పేరయ్య వినిపించుకోలేదు. ”మీకు కావలసింది డబ్బు. నేనిస్తానుగా. మా పెరట్లో తవ్వినా వూరి బయట తవ్వినా ఒక్కటే… ఏమంటారు?” అని అడిగాడు. వాళ్ళు తలలూపి ‘సరే’ అని వెళ్ళిపోయారు.

మర్నాడు ఉదయమే ఊరిబయట కాలిబాటల ప్రక్కగా బావి త్రవ్వకం ప్రారంభమైంది. కరణం అది విని పేరయ్య ఇంటికి పరుగెత్తుకు వచ్చి ”నీకు పిచ్చి పట్టిందా పేరయ్యా! ఇప్పడే విన్నాను. ఏమీటీ పని?” అని అడిగాడు. పేరయ్య ఏమీ మాట్లాడకుండా శిలావిగ్రహంవలె కూర్చున్నాడు. ఎంతసేపటికీ జవాబు చెప్పలేదు.

వరుసగా నాలుగురోజులు పని సాగింది. గంగ కటాక్షించలేదు. పేరయ్య తన పనులన్నీ పూర్తిచేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు. నాలుగోనాడు పని పూర్తిచేసుకుని ఇళ్ళకి తిరిగిపోతూ పనివాళ్ళు పెదవులు విరిచారు. ‘లాభం లేదు. ఇక్కడ జలపడదు’ అన్నారు. పేరయ్య కళ్ళు చెమర్చినయ్‌. పనివాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడక్కడే చాలాసేపు కూర్చున్నాడు. చీకటి పడింది. పేరయ్య కదలలేదు. చిన్న చిన్న రాళ్ళు చేతిలోకి తీసుకుని బావిలోకి విసిరివేస్తూ ఆలోచనలో పడ్డాడు. ఉన్నట్టుండి అతని శరీరం జలదరించింది ‘బుడుంగు’మని చిన్న శబ్దం వినిపించి అతడు ఆతృతగా బావిలోకి తొంగిచూశాడు. నీళ్ళు! అతడు త్వరత్వరగా పనివాళ్ళు ఏర్పరచుకొన్న మెట్లుదిగి లోపలికి వెళ్ళి దోసిలినిండా నీళ్ళు తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. ఆ నీళ్ళు కొబ్బరి పాలవలె ఉన్నాయి. అతడు ఉత్సాహంతో పొంగిపోతూ, నీళ్ళు నిండిన కళ్ళతో ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి వాకిట్లో వేపచెట్టు క్రింద కుక్కి మంచంలో పడుకుని చల్లనిగాలి అలలు అలలుగా వీచి జోకొడుతూ ఉండగా ఆదమరచి నిద్రపోయాడు.

ఆ మరుభూమిలో జలపడటం, అందులోనూ అంత తీయని నీళ్ళు పడటం అందరికీ చిత్రమనిపించింది. తర్వాత రెండు మూడు రోజులలో పనివాళ్ళు బావి చుట్టూ పళ్ళెం కూడా కట్టి డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు. పేరయ్య వాళ్ళతో మాట్లాడుకొన్న డబ్బు కాక తన దగ్గర మిగిలిన మరో అయిదు రూపాయలు కూడా వాళ్ళకే ఇచ్చాడు. అతని మనస్సు ఎంతో తేలికపడింది.

తర్వాత అతని జీవితం చాలా సాధారణంగా గడిచిపోయింది. వూళ్లో ఎవరి ఇంట్లోనైనా పెళ్ళివంటి శుభకార్యాలు ఘటిల్లినప్పుడు ఉత్సాహంగా పనిచేసేవాడు. అతనికి నీళ్ళకావడి ప్రియతమమైన వస్తువైపోయింది. అతడు రోజూ బావినుంచి ఇంటికి వచ్చే దోవలో అటూ ఇటూ ఉన్న వెదురు పొదలు కాలక్రమేణా దట్టంగా పెరిగినయ్‌. ఆ వెదురు పొదలలోనుంచి రకరకాల ధ్వనులు వినిపిస్తూ ఉండేవి. కోయిల సమయం వచ్చినప్పుడు ఆకుల గుబురులలో దాక్కుని ఎవరికీ కనిపించకుండానే కర్ణపేయంగా కూస్తూ వుండేది. వూళ్ళో హరికథ, భజనవంటి కాలక్షేపాలున్నపుడు పేరయ్య హాజరవుతూ ఉండేవాడు. భజన సమయంలో నలుగురితో చేరి ‘సెమ్మె’ చుట్టూ తిరుగుతూ చిరుతలు మోగిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు.

*****

ఆ యువకుడు కళ్ళు విప్పి చూశాడు. ఎండలో చురుకుపాలు తగ్గింది. ఒక కాకి ‘కావు కావు’ మని అరుస్తూ ఎగిరిపోతున్నది. రెండు మూడు మబ్బు తునకలు ఆకాశంలో కదులుతున్నాయి. దూరం నుంచి సముద్రపు గాలి తెరలు తెరలుగా వీస్తున్నది.

అతడు లేచి నిలబడి, ‘అవును ఈ బావి త్రవ్వించిన వాడూ అందరిలాగే కాలం చేరువైనప్పుడు శాశ్వతంగా కన్నుమూసి ఉంటాడు. అయినా, ఇంకా అతడు దాహంగొన్న బాటసారులకు ప్రాణదానం చేస్తూనే ఉన్నాడు. అతని ఆత్మ ఈ పరిసరాల్లోనే విహరిస్తూ దాహం గొన్నవారిని ఇటువైపే లాక్కొని వస్తుంది. అటువంటివ్యక్తులకు ‘పునర్జన్మ’ ఉండదు.’ అనుకుంటూ చేతిలో సంచితో నడక సాగించాడు.

*

(ఆంధ్రసచిత్ర వారపత్రిక, 28-6-1961 )

 

మంచి విషయం నలుగురికీ చెప్పండి !
Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someonePrint this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)