ప్రపంచం మాయమైపోయింది

prapancham mayam aipoindi 2

అదేంటో ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆమధ్య ఒకసారి పొద్దునపూట చూడటం మొదలుపెట్టా, మధ్యాహ్నం అమ్మ భోజనానికి కేక వేస్తేగాని తెలివిరాలేదు . ఆకలి గుర్తురాదు. అప్పుడప్పుడు నిద్రపోవడం కూడా మర్చిపోతుంటాను. హాల్లో అందరూ కూచుని సంతోషంగా టివి చూస్తుంటే, నేను పొద్దుగూకులు పడకగదిలో ఏం చేస్తుంటానా అని మా అమ్మకి చాలా సార్లు అనుమానం వచ్చింది.

“ఏం చేస్తున్నావురా” అడిగేది

“రాస్కుంటున్నాను మా” చెప్పేవాడిని

“ఏం రాస్తావో ఏంటో ! ఎప్పుడు చూసినా ఆ కిటికీలోంచి బయటికి చూడటమే తప్ప ఒక్క ముక్కైనా రాస్తావా అసలు?” చిరాకుపడేది.

“ఒక రచయిత బయటకి తదేకంగా చూస్తున్నాడంటే, వాడు పనిచేస్కుంటున్నాడు అని అర్థం అమ్మా !” అర్థమయ్యేట్టు చెప్పాలనుకునేవాడిని.

‘రచయిత’ అనే పదం వినగానే అమ్మకి నవ్వొచ్చేది. పెద్దగా ఏమీ రాయకపోయినా నేనొక రచయితనని నేను ఈజీగా నమ్మేసాను. మా అమ్మ ఇంకా అది గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా నమ్మడానికి సిద్ధంగా లేదు. తన దృష్టిలో నేనొక ఇంజనీరింగ్ కుర్రాడిని మాత్రమే. ఒకసారి రచయిత అవుతానని చెప్పాను. అందరిలానే ఎదో ఒక బ్రాంచిలో ఇంజనీరింగ్ చేసేసి, చివరికి ఏ టిసియస్ లోనో ఇన్ఫోసిస్ లోనో ఉద్యోగం సంపాయించాలి. అక్కడితో వాళ్ళ జీవితాలకీ, నా జీవితానికీ ఒక పరిపూర్ణత/సార్థకత దొరుకుతుంది. ఆ తర్వాత నా ఇష్టమొచ్చింది అవ్వొచ్చని చెప్పింది.

అదలా ఉంచితే, ఊరికి పెడగా, జనావాసాలకి దూరంగా, చుట్టూ ఖాళీ స్థలాల మధ్య ఉంటుంది మా ఇల్లు. ఇంత దూరంలో ఎందుకు కట్టిస్తున్నావు నాన్నా అని అడిగాను. “మన దగ్గర కోట్లు లేవు కదరా సెంటర్లో కట్టడానికి. ఇంకొన్ని రోజులు పొతే ఇక్కడ కూడా భూమి రేటు పెరిగిపోతుంది. అప్పుడు ఇంకా దూరం పోవాలి. అయినా ఎంతరా… ఇంకో రెండేళ్లలో ఇదంతా పెద్ద సెంటర్ అయిపొదూ?” అన్నాడు. ఇప్పటికి ఇది నాలుగో సంవత్సరం.

మాకు చాలా మంది చుట్టాలున్నారు అని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటాడు. చిన్నప్పుడెప్పుడో పెళ్ళిళ్ళకి, పండగలకీ కలుసుకున్న చుట్టాలు. ఇప్పుడు నాకు వాళ్ళ మొహాలు కూడా సరిగా గుర్తులేవు. నా టెన్త్ క్లాస్ మొదలు పెళ్ళిళ్ళకి అమ్మా నాన్నా మాత్రమే వెళ్ళొస్తున్నారు. నా గురించి చుట్టాలడిగితే చదువనో పరీక్షలనో చెప్పేవాళ్ళు. నాకు పెద్ద స్నెహితులెవ్వరూ లేరు.

ఒక టి.వి., ముగ్గురు మనుషులూ ఉండే మా ఇంట్లో నాలుగో సజీవమైన మనిషిని ఎప్పుడైనా నేను చూడగలిగాను అంటే నా కిటికి లోంచే ! పడకగదిలో మంచానికి ఒక మూల కూచుంటే కిటికీ లోంచి మా ఇంటి వెనక 20 అడుగుల దూరంలో ఉన్న పెద్ద వేప చెట్టూ, ఇప్పుడిప్పుడే చెట్టులా ఎదుగుతున్న చింతమొక్క , కాసిని తుమ్మ మొక్కలూ, కావలిసినన్ని తీగలూ, పిచ్చిమొక్కలు, పచ్చ గడ్డీ కనపడతాయి. దూరంగా చిన్ని చిన్ని ఇళ్ళు, ఒక సన్న రోడ్డు, ఇంకాస్త దూరంగా ఒక సెల్ ఫోన్ టవరు కూడా కనపడతాయి.

నాకెందుకో అదొక సపెరేట్ ప్రపంచంలా, దానికి ఆ కిటికీ ముఖద్వారంలా, నా ప్రపంచం ఆ కిటికీలోంచి నాలోకి తెరుచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ వేపచెట్టు నాతో స్నేహం చేస్తున్నట్టు అనిపిస్తుంది. గాలి వీచి ఆకులన్నీ గలగలా కదిలి చెట్టంతా ఊగుతూ, తుళ్ళుతూ సముద్రఘోషలాంటి శబ్దంతో నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చెట్టూ ఆనందంలో తూలుతున్నప్పుడు దాని కొమ్మ మీద కట్టిన పక్షి గూడు కులిపోతుందేమో అని భయం వేసేది. కాని అది ఎప్పుడు పడిపోలేదు. చల్లగాలి అలల మాదిరిగా మృదువుగా నన్ను తాకుతుంటే ప్రశాంతమైన , గంభీరమైన సముద్రపు ఒడ్డున నేను కూచున్నట్టు అనిపిస్తుంది.

మధ్యాహ్నం వేళ సూర్యుడు పశ్చిమానికి ప్రయాణం చేస్తూ వచ్చి వేపు చెట్టు వెనక చేరతాడు. కిటికీ పక్కన పడుకుని అనంతంలోకి చూస్తున్న నా కళ్ళమీద కిరణాలతో తట్టినట్టే తట్టి వేపచెట్టు ఆకుల వెనక దాక్కుంటాడు. ఇక అప్పటినుంచి ఒక గంటా రెండుగంటలు వాళ్ళిద్దరూ కలిసి నాతో దాగుడుమూతలు ఆడతారు. గదిలో ఆ మూల వెలుతురు చుక్కలతో అందమైన కదిలే ముగ్గులు వేస్తారు. ఇంతలో ఎక్కడినుంచో కాసిని పిట్టలు వచ్చి కాసేపు సందడి చేస్తాయి. కిచకిచ మని ఏమిటేమిటో మాట్లాడుకుంటాయి. ఇంకాస్త సాయంత్రమయ్యేసరికి కాస్త దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో పిల్లలు కొంతమంది చేరి గోలీలు ఆడతారు. కొంతమంది యునిఫారాలతో, కొంతమంది మామూలు బట్టలతో ఉంటారు. ఆటల్లో అరుచుకుంటారు, గంతులేస్తారు, పందేలు పెట్టుకుంటారు, బూతులు కూడా తిట్టుకుంటారు. అంత చిన్న వయసులో అన్ని బూతులా అని ఆశ్చర్యపోతాను నేను. కొన్ని సార్లు బరెగొడ్లు గడ్డి మేయ్యడానికి వస్తాయి. వాటితోపాటు కొన్ని కాకుల్ని, కొంగల్ని, ఒక ముసలావిడనీ కూడా తెస్తాయి. గొడ్లు గడ్డి మేస్తుంటే కాకులూ కొంగలూ పురుగుల్ని తింటూ ఉంటాయి. వాటి స్నేహం ముచ్చటగా అనిపిస్తుంది నాకు. ముసలావిడ గొడుగు పట్టుకుని వేపచెట్టు కింద చుట్ట కాల్చుకుంటూ కూచుంటుంది. ఇంకాసేపటికి ఎక్కడో దూరంగా ఎదో గుడిలో మైకుపెట్టి ఎవరో వచ్చీరాని భక్తిపాటలు పాడటం వినిపిస్తుంది. అప్పుడప్పుడు అదే స్థాయిలో హలెలూయ పాటలు కూడా వినిపిస్తాయి.

చీకటి పడ్డాక అందరం పడకగదిలో చేరతాం. అమ్మ నాన్నలకి నడుము నొప్పి. కిందే పడుకుంటారు. నేను మంచంపైన కిటికీ ఉండే వైపు పడుకుంటాను. ఆ వైపు ఫ్యాన్ గాలి రాదు. అయినా సరే అప్పుడప్పుడూ వచ్చే కాసింత గాలి ఎంతో ఆనందం. సూర్యుడు స్థానంలో చంద్రుడొస్తాడు. కొన్ని వందల కీచురాళ్ళు సామూహిక గానం చేస్తున్నట్టు రాత్రిని ఒక నిశ్శబ్ద సంగీతంలో ముంచెత్తుతాయి. ఆ సంగీతంలో మమేకమై ఆ కిటికీ చువ్వలని దాటుకుని నా ప్రపంచంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నట్టు కలగనేవాడిని.

నా ప్రపంచంలో ఏది ఎక్కడికీ కదలదు. అవే చెట్లూ, అదే గాలీ, అదే ఆకాశం. నా ప్రపంచం చాలా స్తబ్దంగా ఉంటుంది. కానీ దాని అణువణువునా అనంతమైన చలనం కనిపిస్తుంది. ఆ సులువైన సంక్లిష్టతే నా దృష్టిని కట్టిపడేసేది. నా ప్రపంచం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు.  ఋతువులు మారేకొద్దీ కొత్తరంగులూ, కొత్త రూపాలు ప్రదర్శిస్తుంది. వేడి గాలులూ, వర్షపుహోరులు, రకరకాల పురుగులతో భయం గొల్పుతుంది కూడా. ఇన్ని ఉన్నా ఒక్క లోటు మాత్రం ఉంది. ఎప్పుడూ ఒక్క పిచ్చుక కూడా కనిపించలేదు. అవి వస్తాయేమో అని గింజలు కూడా పెట్టేవాడిని కిటికీ గడపమీద. అయినా ఒక్కటి కూడా రాలేదు. బహుశా అంతరించిపోయాయేమో. !

రెండేళ్ళు గడిచిపోయాయి. మా ఏరియా చిన్న చిన్నగా జనావాసంగా మారుతోంది. అక్కడక్కడా ఇళ్ళు పడుతున్నాయి. మా ఇంటి వెనక ఉన్న స్థలంలో కూడా  ఇళ్ళు కడుతున్నారు. సన్నని మట్టిరోడ్లు పడుతున్నాయి. కరెంటు స్తంభాలకి అడ్డమోస్తోందని నా వేప చెట్టు నరకడం మొదలుపెట్టారు. నేను కిటికీ చువ్వలు పట్టుకుని నిలబడిపోయి చూస్తున్నాను. ఠక్.. ఠక్.. అని తగులుతున్న గొడ్డలి దెబ్బలకి చెట్టు జలదరిస్తోంది. నా శరీరం కంపించింది. కళ్ళు మూసుకుని ఇటు తిరిగి కూచున్నాను. వాళ్ళని ఆపాలనిపించింది. కాని ఏదో అశక్తత నా కాళ్ళని కదలనివ్వలేదు. నరికేటప్పుడు వేసే ఒక్కో వేటు ఒక శబ్దపు వేటై నా గుండెను తాకాయి. పెద్ద శబ్దం చేస్తూ చెట్టు ఒరిగింది. ఈ సారి మాత్రం ఆ పక్షి గూడు కిందపడిపోయి ఉంటుంది. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. చెట్టులేని ఆకాశం బోసిగా ఉంది. చంద్రుడు ఒంటరివాడై వెలవెలబోయాడు. అందరూ కోరుకున్నట్టే ఊరు ‘డెవలప్’ అవుతోంది.

చూస్తూ చూస్తూ ఉండగానే నా ఇంజనీరింగ్ అయిపొయింది. T.C.S. లో ఉద్యోగం వచ్చింది. అమ్మానాన్న చాలా సంతోషపడ్డారు. పూణేలో పోస్టింగ్. నలుగురు కొలీగ్స్ తో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ రెంట్ కి తీస్కున్నాము. ఇక్కడ వాతావరణం చాల వేరు గా ఉంది. ఆఫీసులో కిటికీ అనే పదార్థమే లేదు. ఒక సారి లోపలికొచ్చాక బయట పగలో చీకటో కూడా అర్థం కాదు. ఏసి గదులు, ట్యూబ్ లైట్స్ వెలుతురు. బిజీ బిజీ  లైఫ్. పరిచయంలేని కొత్త కొత్త టెన్షన్స్ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. టార్గెట్స్, అప్ప్రైసల్స్, ప్రాజెక్ట్స్. నా జీవితం నా అదుపు తప్పిపోవడం నేను గమనించ గలుగుతున్నాను కానీ దాన్ని నాకు నచ్చిన దారిలో పెట్టే తీరిక నాకు దొరకడం లేదు.

సంవత్సరాలు రోజులు లాగా దొర్లిపోతున్నాయి. నేను ఇష్టపడిన అమ్మాయితోనే నా పెళ్లి జరిపించారు. తన పేరు సరిత. నా కొలీగ్ యే. పూణేలోనే సెటిల్ అయ్యాము. లోన్ తీస్కుని అపార్ట్మెంట్, కార్ కొనుక్కున్నాము. ఒక పాప పుట్టింది. విదిత అని పేరు పెట్టుకున్నాను.

ఎందుకో మొదట్లో అనిపించినంత వెలితి ఇప్పుడు అనిపించడం లేదు. నేను రాయాలనుకున్నవి రాయలేకపోతున్నాను, చదువుకునే రోజుల్లో అనుభవించినంతగా దేన్నీ అనుభూతి చెందలేకపోతున్నాను, దేనికీ స్పందించలేక పోతున్నాను అనే బాధ ఉండేది మొదట్లో. ఎదో కృత్రిమత్వం జీవితంపై ఆవరించినట్టు అనిపించేది. ఇప్పుడు జీవితం బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. నా విదిత, నా భార్య, నా ఉద్యోగం, నా జీతం… అంతా సక్రమంగా ఉన్నట్టే తోస్తోంది. బహుశా నేనే అలవాటు పడిపోయానేమో లేదా నా ప్రపంచం కుంచించుకు పోయిందేమో.

ఇంటి నుంచి ఫోన్ వచ్చింది.

“పిల్లని తీస్కుని ఇద్దరూ ఒక వారం రోజులు ఇంటికి రావొచ్చు కదరా.. సంవత్సరమవుతోంది.” ఆశపడింది అమ్మ.

“పిల్లకి స్లిప్ టెస్ట్ లు ఉన్నాయమ్మా. మాక్కూడా వారం సెలవు దొరకడం కష్టం” నిరాశ పరిచాను.

అమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. ఎందుకో ఆ రోజంతా నేను చెప్పిన సమాధానం ఒక ప్రశ్నలా నన్ను పీడించింది. ఏదో అపరాధ భావన కలిగింది. ఆ రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది. రెండు గోడల మధ్య నేను ఇరుక్కుపోయి ఉన్నాను. ఆ గోడల మధ్య ఒక్క అడుగు మాత్రమే జాగా ఉంది. నేను కదల్లేకపోతున్నాను. ఊపిరి కూడా అందడం కష్టంగా ఉంది. ఆ గోడలు దగ్గరకి జరగడం మొదలుపెట్టాయి. నా శరీరం ముక్కలైపోవడం మొదలయ్యింది. ఉలిక్కిపడి లేచాను. తరవాత రోజు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాము.

“ఎక్కడికెళ్తున్నాం నాన్న?” అడిగింది విదిత.

“ గుంటూరు తాత వాళ్ళింటికి నాన్నా.” చెప్పాను.

విదితకి 5 సంవత్సరాలు. పూర్తిగా ఊహ తెలిసిన తర్వాత ఇదే మొదటిసారి ఇంటికి తీస్కేళ్తున్నాను. తను ఈ మధ్య నా మాటలు బాగా అర్థం చేస్కుంటోంది. నా భావాలకి సంఘీభావం కూడా వ్యక్తం చేస్తోంది. చాలా తెలివైన పిల్ల. ఊరు బయల్దేరినప్పుడు నాలో ఒక కోరిక మొదలైంది. విదితకి నా ప్రపంచం పరిచయం చెయ్యాలనిపించింది. తనని అదే మంచం మీద పక్కన కుచోపెట్టుకుని కిటికీ లోంచి నా స్నేహితులని ఒక్కొక్కరినీ పరిచయం చెయ్యాలి, నా ప్రపంచపు వాకిలిలో తనని ఆడించాలి అనిపించింది. ఇప్పుడు తను అర్థం చేస్కోగలదు. వాటిని తన సొంతం చేస్కోగలదు.

బస్సు దిగి ఇల్లు చేరేసరికి సాయంత్రమైంది. పడమర వైపు ఆకాశం నారింజరంగుతో అద్భుతంగా ఉంది. కిటికీలోంచి ఈ సన్నివేశం తప్పక చూడాల్సిందే. ఇంట్లోకి రావడమే విదితని తీస్కుని సరాసరి పడక గదిలోకి వెళ్లాను. ఇద్దరం ఒక గెంతుతో మంచం ఎక్కి కిటికీకి ఉన్న గొళ్ళాలు తీసి బార్లా తెరిచాం.

ఎదురుగా గోడ. సున్నం లేని గరుకు ఇటుకల గోడ ! వెనక ఇల్లు హద్దుదాకా కట్టారు. ఏదీ వెలుతురు? ఏదీ సూర్యకాంతి? ఏదీ చల్లగాలి? ఏవీ నా చెట్లు? నా ప్రపంచం మాయమైపోయింది ! నా బాల్యంలో ఒక భాగం అనాథ అయిపోయింది !

*****

– వినోద్ అనంతోజు

Vinod Anantoju

మంచి విషయం నలుగురికీ చెప్పండి !
Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someonePrint this page

Comments

  1. By వనజ తాతినేని

    Reply

  2. By CA PV MALLIKARJUNA RAO

    Reply

  3. By chandramouli k

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)