సంసారి

 

samsari image

Photo Courtesy – Peter Doig

కోసక్కు గ్రామం పొలిమేరల నుంచి ప్రారంభమవుతుంది మహారణ్యం. దట్టమైన చెట్లతో ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంటుంది. పగటికీ, రాత్రికీ తేడా ఉండదు.

ఒక సాయంత్రం డాన్‌ నది దాటటానికి సరంగు కోసం వెదికాను. ఆ రోజెందుకో పడవలెక్కువ లేవు. వర్షం కురిసి, నేలంతా చిత్తడిగా ఉంది. ఆకులు, చిన్న జంతువుల కళేబరాలు, కుళ్ళిన దుర్గంధం అతటా వ్యాపించింది. బురదలో కాలు తీసి కాలు వెయ్యటం కష్టంగా ఉంది. ఊరి చివరన, స్మశానంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. మరి కాసేపట్లో కన్ను పొడుచుకున్నా కనిపించదు.

నా కోసమే కాబోలు- ఒక పడవ ఒడ్డుకు వచ్చింది. భయంకరమైన ఆ నిశ్శబ్దంలో నీళ్ళు కొట్టుకొంటున్న చప్పుడు కాస్త ధైర్యమిచ్చింది. తెడ్లు కదులుతున్నంత సేపూ నా కోసం మరో మనిషి ఉన్నాడని భరోసా.

పడవ నడుపుతున్న వృద్ధుడు కళ్లు చిట్టించిచూస్తూ, నా కోసం వెదుకుతున్నాడు. చిరిగిన దుస్తులు, నెరిసిన గడ్డం, ముడతలు పడ్డమొహం.

”అద్దరికా? త్వరగా రా. చీకటి పడుతోంది” అంటూ తొందరపెట్టాడు.

ఆ చేతులకు నన్ను దాటించగల శక్తి ఉందా?

”నువ్వొక్కడివే ఎందుకు కష్టపడతావు. నేనూ తెడ్డు వేస్తాలే” అన్నాను.

”రావయ్య బాబూ. సాయం చేస్తే వద్దంటానా ఏమిటి? చీకటి పడ్డాక డాన్‌ దాటటమంటే మాటలు కాదు. ఎలా పొంగుతోందో చూడు”

ప్యాంటు పైకి మడుచుకుని వెళ్ళి పడవలో కూర్చున్నాను.

నన్ను పరీక్షగా చూస్తూ, ”నీది ఈ ప్రాంతం కానట్టుందే” అన్నాడు వృద్ధుడు అనుమానంగా.

”సైన్యంలో ఉన్నాను. ఊరికి పోతూ ఇటు వచ్చాను.”

అతడు తల విదిలించినప్పుడు గడ్డం వెండి బ్రష్‌లాగ మెరిసింది.

”సెలవేనా? లేక పారిపోయి వస్తున్నావా?”

మాట్లాడుతున్నప్పుడు ఎగుడు దిగుడుగా ఉన్న పిచ్చిపళ్ళు కదలి, జారి కింద పడతాయేమో ననిపించింది.

”నేను యాక్షన్‌కు పనికి రానన్నారు. ఆరోగ్య కారణాలు”

”ఇప్పుడు యాక్షన్‌ లేదుగా. అంతా ప్రశాంతంగా ఉంది కదా”

నేను కూడా తెడ్డు వేయడం ప్రారంభించాను. గట్ల మీద రెల్లు పొదలు ఏవో రహస్యాలను దాస్తున్నట్లుగా ముడుచుకున్నాయి. పడవ అడుగున నీళ్లు తాకుతున్న చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది. అతణ్ణి చూసి మొదట బలహీనుడనుకున్నాను గాని, కండలు తేరిన భుజాలతో నాకన్న వేగంగా తెడ్డు తిప్పుతున్నాడు. సన్నగా, పొడుగ్గా ఉన్న వేళ్ళు హేండిల్‌ను గట్టిగా పట్టుకున్నాయి. వంగిన భుజాలతో ఆకారం వింతంగా కనిపించింది. తెడ్డువెయ్యడం కూడా ఒక కళ.

అలసి, బరువుగా ఊపిరి పీలుస్తున్నాడు. అల్లిన ఉలెన్‌ షర్టు చెమట వాసన వస్తోంది. నోటి నుండి పొగాకు కంపు వస్తోంది. మరోవైపు నీచు దుర్గంధం. ఏవో ఆలోచిస్తూ ఉలిక్కి పడినట్టుగా, ”మనం క్షేమంగా అటువైపు చేరుతామా లేక ఈ దుబ్బుల్లో చిక్కుకుంటుందా పడవ?” అన్నాడు గట్టువైపు చూస్తూ.

నిజమే. నది మధ్యన సుడి గుండాలున్నాయి. ఎవరో ఎత్తి పడేసినట్టుగా ఊగింది పడవ. చెట్లను, ముళ్ళ కంపలను చేత్కోపక్కకు నెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు కదిలాం.

ఈ కష్టాలు చాలవన్నట్టు అరగంట తర్వాత పిచ్చిమొక్కల్లో చిక్కుకుని తెడ్డు ఇరిగింది. అడుగున కనిపించని రంధ్రం ఉందేమో, నీళ్ళు వచ్చి చేరాయి. ఇంక చేసేదేముంది. అతి కష్టంమీద గట్టుకు చేరాం. ఆ అడవిలోనే రాత్రంతా గడపక తప్పదు. అతడు తన మట్టి పైపు వెలిగించాడు. నీటి కొంగలు కీచుకీచుమన్నాయి. ఇతర జంతువుల్లాగే మేం కూడా ఈ చీకట్లో ఓ చెట్టుకింద ముడుచుక్కూర్చున్నాం.

”ఇంటికి వెడుతున్నావు. మీ అమ్మ నీ కోసం నిరీక్షిస్తూ ఉండి ఉంటుంది. ముసలి తల్లికి కొడుకును చూస్తే కలిగే ఆనందమ ఎత గొప్పదని! నీకు పెళ్ళైందా? పిల్లలున్నారా? లేకపోతే మరో తండ్రి మనసులో దాచుకున్న బాధ నీకర్థం కాదు…” అంటూ ప్రారంభించాడు.

”వయసుడిగింది. ఎక్కువ కాలం బతకను. కానీ ఇంత దు:ఖాన్ని ఎలా భరించను.

నీకీ ప్రాంతం పరిచయం లేదన్నావు గదా. ఓ కథ విను. ఇన్ని అనుభవించిన మనిషి ఇంకా బతికుండే అవకాశముందేమో చెప్పు.

వింటున్నావా? నాకో కూతురుంది. దాని పేరు నటాషా. వచ్చే నెలకు పదిహేడు నిండుతాయి. ఒకనాడు నాకు భోజనం వడ్డించి అదంటుందీ..

‘నీ ముందర కూర్చోవాలంటేనే అసహ్యాంగా ఉంది. ఆ చేతులు చూడు, నెత్తురోడుతున్నాయి. కడుపున పుట్టిన పిల్లల్ని చంపిన చేతులు, ఛీ, కడుపులో తిప్పుతోంది. నీ మొహం చూస్తేనే డోకొస్తుంది…’ అని.

పిచ్చి ముండ. వాళ్ళ మంచి కోసమే నేనా పని చేయాల్సి వచ్చిందని దానికి తెలియదు. మిగతా పిల్లలు బతికి బట్టకట్టాలంటే కొందర్ని బలివ్వక తప్పదు.

నాకు చిన్నప్పుడే పెళ్ళైంది. పెళ్ళానికి సంతానరేఖ బలంగా ఉందేమో వరుసగా ఎనిమిది మందిని కన్నది. తొమ్మిదోసారి దానికి అచ్చిరాలేదు. పురిట్లోనే జ్వరం వచ్చింది. అయిదు రోజులు గిలగిలా కొట్టుకుని తన దారిన తాను పోయింది. దాన్ని మిగిల్చి, కొందరు పిల్లలు కావాలన్నా దేవుడికి సంతోషంగా సమర్పించుకునేవాణ్ణే. కాని పెళ్లాంలేని గంపెడు పిలల్నేం చేసుకోను! అందర్లోకి పెద్దవాడు ఇవాన్‌. ఎత్తుగా, బలంగా, అచ్చం నాలాగే ఉండేవాడు. మా కోసక్కు (తెగ) వాళ్ళందరూ గర్వించదగిన అందగాడు. కష్టపడి పనిచేసేవాడు. ఇవాన్‌ కన్నా నాలుగేళ్లు చిన్నవాడు నా రెండో కొడుకు. అంతా తల్లి పోలికే. బొద్దుగా తెల్లగా ఉండేవాడు. మిలమిలా మెరిసే గోధుమ రంగు కళ్లు. నా పిల్లలందర్లోకి వాడంటేనే నాకిష్టం. పేరు డానిలా. మిగతా ఏడుగురూ ఆడపిల్లలు. ఇవాన్‌కు పెళ్లి చేశాను. కొంత పొలం కూడా రాసిచ్చాను. త్వరలోనే వాడూ పిల్లల్ని కన్నాడు. డానిలాకు కూడా పెళ్ళి చేద్దామని అనుకుంటున్నప్పుడు గొడవలు ప్రారంభమయ్యాయి. సోవియట్లకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చెలరేగాయి. ఆ రెండో రోజే ఇవాన్‌ వచ్చి ”నాన్నా…మనం ఎర్రవాళ్లతో కలుద్దాం. మనలాంటి పేద రైతులకు న్యాయం జరగాలంటే రెడ్స్‌తో చేరక తప్పదు” అన్నాడు. డానిలా కూడా అన్నకు వంతపాడాడు.

అంతా విని ”మీ ఇష్టం వచ్చిన వాళ్లతో చేరండి. నేను అడ్డుపడను. కానీ నన్ను మాత్రం వదలండి, ‘ఏడుగుర్ని పెంచి పోషించవలసిన బాధ్యత నామీదుంది” అన్నాను.

అంతే నాకు మరోమాట చెప్పకుండా తమ దారిన వెళ్లిపోయారిద్దరూ. కొద్ది రోజుల్లోనే కోసక్కుల సైన్యంలో చేరాలని నాకూ ఆదేశం వచ్చింది. ఇక నా డ్యూటీ వైట్స్‌ (బోల్షివిక్కు-కమ్యూనిస్టు వ్యతిరేకులు) దళంలో.

మమ్మల్ని సమావేశపరిచినప్పుడు నిర్మొహమాటంగా, ”నేను సంసారిని. ఏడుగురు పిల్లల పోషణ బాధ్యత నామీదుంది. నేను చస్తే నా పిల్లల గతేమవుతుంది?” అంటూ మొరపెట్టుకున్నాను.

కానీ వాళ్లు ఎవరి విన్నపాలూ వినరు. నాది అరణ్యరోదనే అయింది. వారం తిరక్కుండానే వైట్స్‌తో యుద్ధరంగానికి బయల్దేరాను.

నా పొలం పక్కనే శత్రువులు ఎదురుపడ్డారు. భీకరమైన పోరు జరిగింది. ఈస్టర్‌ ముందు రోజు, ఎనిమిది మందిని బందీలుగా పట్టుకున్నారు. అందులో నా ప్రాణానికి ప్రాణం డానిలా కూడా ఉన్నాడు. బందీలను మా బాటరీ (దళం) కమాండర్‌ ముందు హాజరుపరిచాం.

”ఈ పందికొక్కుల్ని బూటుకాళ్లతో నలిపెయ్యండి. ఒక్కొక్కద్రోహినీ ముక్కలు ముక్కలుగా నరికి కాకులకూ, గద్దలకూ వేద్దాం. ఎక్కడ ఆ ద్రోహులు” అంటూ వీధుల్లో కవాతు చేస్తూ నినాదాలిచ్చారు కోసక్కు సైనికులు.

ఆ అరుపులు వింటుంటే నా కాళ్లు వణికాయి. నా బాధ, భయం ఎవరికీ పట్టవు. డానిలాను తలచుకుంటే గుండె చెరువైంది. కోసక్కులు నావైపు అనుమానంగా చూశారు. ఒకడు వేలు చూపి మరీ ఏదో బూతు కూశాడు. అప్పుడు మా బాటరీ సార్జంట్‌ అర్కాషా నన్ను పిలిచి.

”ఈ కామ్మీ (కమ్యూనిస్టులు) గాళ్ళను ఏంచేద్దామంటావు మికిషారా?” అంటూ అడిగాడు- ‘ఆయనకు నా సలహా కావాలా ఏమిటి, నన్ను ఉడికించటానికి కాకపోతే’.

నాకూ పౌరుషం ముంచుకు వచ్చింది.

”వాళ్లనేం చేసినా పాపం లేదు” అన్నాను.

”గుడ్‌…మాటలు కాదు. బాయ్‌నెట్‌ తీసుకుని ముందుకు కదులు మరి! లేదా నువ్వూ వాళ్లతో మిలాఖత్‌ అయ్యావనుకోవలసి వస్తుంది” అంటూ తుపాకీ నా చేతిలో పెట్టాడు సార్జంట్‌.

లోలోపలే దేవుణ్ణి ప్రార్థించాను. ‘ఇదేనా ప్రారబ్దం! నాకన్న కొడుకును నేనే చంపుకోవాలా?’ కమాండర్‌ ఆర్డరిచ్చిన మరుక్షణం బందీలను వరుసగా ముందర నిలబెట్టారు. ధైర్యంగా, తలెత్తి, చిరునవ్వుతో చూశాడు నా డానిలా. వాణ్ణి చూడగానే నా గుండె జారిపోయింది. కాళ్లతో నిలబడే శక్తి కూడా లేదు. అప్పటికే వాళ్లనెన్ని చిత్రహింసలు పెట్టారో. వాడి తల కాయ పెద్ద బకెట్‌ లాగ వాచిపోయింది. శరీరమంతా నెత్తురోడుతోంది. అందరూ కసాయిశాలలో తలలు తెగిపడుతున్న పశువుల్లాగున్నారు. నేలమీద ధారగా కారింది నెత్తురు. చివరి ఆలింగనం కోసమన్నట్టుగా వాడు నావైపు చేతులు చాపాడు. నవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు కాని చెంపలకూ, కణతలకూ, కళ్లకూ తగిలిన దెబ్బలవల్ల నోరు తెరవలేకపోతున్నాడు. ఒక కన్నైతే నెత్తుటి ముద్దలాగున్నది. గుడ్డు పీకేసినట్టే ఉంది.

అప్పుడు గానీ నాకు అసలు విషయం అర్ధం కాలేదు. నేను గనక వాళ్ళను చంపకపోతే కోసక్కులు నన్ను చంపుతారు. నేను చస్తే మరి నా ఏడుగురు పిల్లల గతేమిటి?

”నాన్నా!” అన్నాడు డానిలా. కన్నతండ్రి తనను చంపగలడా అని చివరి ఆశ కాబోలు. నెత్తుటితో కలసిన కన్నీరు మొహం మీద జేగురు రంగులో అట్టకట్టింది. రక్షించమని నన్ను ప్రాధేయపడుతున్నాడు నా కన్న తండ్రి. కానీ… నా బాధ్యత విస్మరించలేను గదా. బాయ్‌నెట్‌ ఎత్తి బలంగా గుండెల్లో గుచ్చాను. వాడు కెవ్వుమని కేకేశాడు. తుపాకీ మడమతో మొహం మీద మరోదెబ్బ. మొదలు తెగిన చెట్టులా నేలకొరిగాడు నా డానిలా.

కోసక్కులు విజయగర్వంతో నినాదాలు చేశారు. ”చూస్తావేం మికిషారా, ఒక్కొక్కణ్ణీ నరికి పోగులుపెట్టు. నీ కొడుకని జాలి చూపిస్తున్నావా ఏం? బాయ్‌ నెట్‌తో వాడి ఒళ్ళంతా జల్లెడ చేసెయ్యి. లేదా నీకు అదే గతి పడుతుంది….”

”నేను వాళ్ళను తగినంత చిత్రహింసలు పెట్టలేదని కమాండర్‌కు కోపం వచ్చింది. మిగతా సైనికులంఆ ఒక్కసారి మీదపడి, తమ చేతిలోని ఆయుధాలతో పొడిచి, మోది కసి తీర్చుకున్నారు. ఆ దృశ్యం చూస్తే నాకు కళ్లు తిరిగినట్టైంది. వీధిలోకి పరిగెత్తాను. వాళ్లు డానిలాను తుపాకులతో పొడుస్తూ, తన్నుతూ నేల మీద పడేసి ఈడ్చారు. జంతువులను కూడా మనం ఒక్కసారి తల నరికేస్తాంగాని అలా హింసించం. చివరగా, సార్జంట్‌, డానిలా గొంతులో బాయ్‌నెట్‌ కసుక్కున పొడిచాడు”

పడవ కింద, వడివడిగా ప్రవహిస్తున్న నీటి ¬రు వినిపిస్తోంది. దుబ్బులు గుచ్చుకుని ఒళ్లంతా దురద పెడుతోంది. మికిషారా పైప్‌ నుండి నిప్పురవ్వలు ఎగిసి పడుతున్నాయి.

”పడవలో నీటి మట్టం పెరిగింది. మునిగి పోతుందిక. మరో పడవ వచ్చిందాకా మనమిక్కడే గడపక తప్పదు” అంటూ కళ్లు చిట్లించాడు.

”మొత్తం మీద, డానిలాను చంపినందుకు సీనియర్‌ సార్జంట్‌ నాకు ప్రమోషన్‌ వచ్చింది” అన్నాడతడు దిగులుగా.

”అప్పటికీ, ఇప్పటికీ డాన్‌ ప్రవహిస్తూనే ఉంది. నేను బాయ్‌నెట్‌ ఎత్తినప్పుడు ‘నాన్నా’ అన్న డానిలా గొంతు ఎప్పటికీ మరుపురాదు. అది డానిలా కాదు. వాడి రూపంలో నన్ను వెంటాడుతున్న నా అంతరాత్మ.

”మరికొన్ని నెలలు రెడ్స్‌తో యుద్ధం కొనసాగింది. జనరల్‌ సెక్రటియొవ్‌ నాయకత్వంలో మేం కమ్యూనిస్టులను డాన్‌ ప్రాంతం నుండి సరాటోవ్‌ దాకా తరిమికొట్టాం. సంసారం చేసుకునే సాదాసీదా మనిషిని నేను. కానీ నా కొడుకు బోల్షివిక్కుల్లో ఉండటం వల్ల నేను యుద్ధం చెయ్యక తప్పదన్నారు. మా సైన్యం బలాషెవ్‌ నగరం దాకా చొచ్చుకువచ్చింది. నా పెద్ద కొడుకు ఇవాన్‌ జాడ తెలియలేదు. వాడు బోల్షివిక్కులను వదిలి కోసక్కుల ముప్పై ఆరవ బాటరీలో చేరాడని తెలుసుకున్నారు మా వాళ్లు. ‘వాడు కనిపిస్తే ఖతం చేస్తా’ మన్నారు మరికొందరు.

మా సైన్యం మారో ఊరికి చేరింది. అక్కడ ముప్పై ఆరో బాటరీ మాటువేసి ఉంది. మా వాళ్ళు చాకచక్యంగా ఇవాన్‌ను పట్టుకున్నారు. చేతులు వెనక్కు విరిచి కమాండర్‌ వద్దకు ఈడ్చుకొచ్చారు. దారిలో కనిపించిన కోసక్కులందరూ వాణ్ణి కొడుతూనే ఉన్నారు.

‘వీణ్ణి తీసికెళ్ళి రెజిమెంటల్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో అప్పగించ’మని నన్నాదేశించారు.

తొమ్మిది మైళ్ళ దూరంలో ఉంది హెడ్‌ క్వార్టర్స్‌. ”నీ కొడుకును జాగ్రత్తగా తీసికెళ్లు మికిషారా. నిన్ను వదిలి వాడు పారిపోలేడులే” అన్నాడు కమాండర్‌ వ్యంగ్యంగా నవ్వుతూ.

వాళ్ళ దుష్టబుద్ధి నాకు తర్వాత అర్థమైంది.

వాడు పారిపోతే తరువాత వాణ్ణి వెదికి పట్టుకుని, విధి నిర్వహణలో చేసిన తప్పిదానికి నాకు మరణ శిక్ష విధించవచ్చు.

గార్డు వద్దకెళ్లి, ఇవాన్‌ను నాకప్పగించమని అడిగాను.

ఖైదీని ఎస్కార్ట్‌ చేసే బాద్యత నాది. సగం దూరంనడిచాక, ”నాన్నా, మనమక్కడికి చేరగానే వాళ్లు నన్ను చంపేస్తారు. వదిలెయ్యరాదూ, దూరంగా ఎక్కడికైనా పారిపోతాను” అన్నాడు ఇవాన్‌.

”నిజమే నాన్నా. నాకూ బాధగానే ఉంది” అన్నాను నేను. వాడి పరిస్థితి చూస్తుంటే కన్నీరాగలేదు.

”వదిలెయ్యి మరి”

”సరే, మరికాస్త దూరం వెళ్లాకవదిలేస్తాను. నువ్వు పరిగెత్తు. లాంఛనంగా నేను మూడుసార్లు కాలుస్తాను.”

మరో మైలు నడిచాం.

”గుడ్‌బై నాన్నా. నేను బతికుంటే నీ చివరిక్షణం దాకా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను” అంటూ నన్ను గాఢంగా కౌగిలించుకున్నాడు ఇవాన్‌.

”ఇవాన్‌, పరిగెత్తు” అంటూ అరిచాను కౌగిలి విడిపించుకుంటూ.

”వాడో పాతిక గజాలు పరిగెత్తాడో లేదో, రైఫిల్‌ అందుకుని వాడివెన్నుకు గురిచూసి కాల్చాను…”

పైప్‌లో పొగాకు దట్టించి, చెకుముకిరాయితో కొట్టి వెలిగించాడు మికిషారా. నెమ్మదిగా పొగలేచింది. పైపు పీల్చి దవడలు పీక్కుపోయాయి. ఆ కనుగుడ్లు గులకరాళ్లలా ఉన్నాయి. ప్రేమా, బాధ, పశ్చాత్తాపం ఏవీ లేవు ఆ కళ్లలో.

వెనుక నుండి ఎవరో తోసేసినట్టుగా ఎగిరి ముందుకు పడ్డాడు ఇవాన్‌.

”ఎందుకు కాల్చావు నాన్నా?” అన్నాడు బాధతో మెలికలు తిరిగిపోతూ.

వాడి దగ్గరకు పరిగెత్తి, ”ఇవాన్‌…నాన్నా…” అంటూ పైకి వంగాను. పెదాలమీద నెత్తురు ఉబుకుతోంది. అది వాడి చివరి ఘడియ. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకుని లేచి, ”నాన్నా, నాకూ ఓ భార్య, కొడుకూ ఉన్నారు” అని తల వెనక్కు వాల్చాడు.

గాయం తడిమి చూసుకున్నప్పుడల్లా వాడి చెయ్యి నెత్తుట్లో మునుగుతున్నది. బాధ భరించలేక మూలిగాడు. నాలిక బైటికి వచ్చి వాలిపోయింది. అస్పష్టంగా ‘నా..న్నా…నా…న్నా’ అన్నాడు.

”నిజమే నాన్నా. నీకో భార్యా, కొడుకూ ఉన్నారు. కాని నాకు ఏడుగురు పిల్లలున్నారింకా – వాళ్ల పోషణ నాకు ముఖ్యం. నిన్ను పారిపోనిస్తే కోసక్కులు నన్ను చంపేస్తార. నా ఏడుగురు పిల్లలూ అనాథలవుతారు…

మరి కాసేపటికి, నా చేతుల్లోనే వాడు ప్రాణాలొదిలాడు.

తెలిసిందా. పిల్లలున్న తండ్రికెన్ని కష్టాలో? వాళ్లను పెంచి చెయ్యటంలోనే జుత్తు నెరిసిపోయింది. ఇదిగో, ఇప్పటికీ, నేను రెక్కలు మ్కులు చేసుకోని రోజు లేదు. నాలాంటి రాక్షసుడితో కలిసి ఉండటమే మహాపాపమంటుంది నా కూతురు నటాషా.

నువ్వు లోకం తెలిసిన మనిషివి గదా! సంసారం కోసం ఓ మనిషి ఇంకెంత త్యాగం చెయ్యాలి?” అంటూ ఒక జవాబు లేని ప్రశ్న అడిగాడు మికిషారా.

*****

రచయిత పరిచయం
మిహైల్‌ షొలొఖోవ్‌ (1905-1984)

డాన్‌ ప్రాంతంలోని కోసక్కు గ్రామం వెశెన్స్కయాలో జన్మించాడు మిహైల్‌ అలెగ్జాండ్రోవిచ్‌ షొలొఖోవ్‌. తండ్రి పశువుల వ్యాపారస్థుడు. తల్లి టర్కిష్‌ సంతతికి చెందినది. వివిధ స్కూళ్ళలో విద్యాభ్యాసం చేసిన షొఖోవ్‌ పన్నెండేళ్లప్పుడే – అంటే – విప్లలకాలంలో బోల్షివిక్కులలో చేరాడు. ప్రత్యక్షయుద్ధంలో

mikhail-sholokhovకూడా పాలు పంచుకున్నాడు. 1922లో మాస్కో చేరుకుని జర్నలిస్టుగా కొత్త జీవితం ప్రారంభించాడు. అనేక పత్రికలలో చిన్న కథలు ప్రచురించడం ద్వారా అతని రచనా జీవితం ప్రారంభమైంది. 1926లో తొలి కథా సంకలనం ”టేల్స్‌ ఫ్రంది డాన్‌” వెలువడింది. అదే సంవత్సరం సోవియట్‌ సాహిత్యానికే గర్వకారణమైన టిఖిడాన్‌-ఇంగ్లీషులో ‘అండ్‌ క్వయెట్‌ ఫ్లోస్‌ ది డాన్‌’ నవలా రచన ప్రారంభించి పధ్నాలుగేళ్ళు అవిశ్రాంత కృషి చేశాడు. ఇందులోని యుద్ధవర్ణనలు, పాత్రల మనస్తత్వ చిత్రణ, విప్లవ వాతావరణం, ముఖ్యంగా రష్యన్‌ సమాజంలో వచ్చిన సమూలమైన మార్పును పాఠకుడికి కళ్లకు కట్టినట్టుగా చూపగలిగిన ప్రజ్ఞ – ఈ నవలకు ఇరవయ్యో శతాబ్దపు ”యుద్ధము – శాంతి” అన్న కీర్తి నార్జించి పెట్టాయి. షొలొఖోవ్‌ మరో ముఖ్య నవల ‘వర్జిన్‌ సాయిల్‌ అప్‌టర్న్‌డ్‌’ (బీళ్లు దున్నేరు) 1932లో వెలువడింది. 1932లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకున్న షొలొఖోవ్‌ సుప్రీం సోవియట్స్‌కు ప్రతినిధిగా, 1939లో సోవియట్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ సభ్యుడిగా, సోవియట్‌ రచయితల సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. 1965లో షొలొఖోవ్‌కు నోబెల్‌ బహుమతి లభించింది.

 

*****

మంచి విషయం నలుగురికీ చెప్పండి !
Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someonePrint this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)